- నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ జి.వి. శ్యాంప్రసాద్ లాల్ బ్యాంకులకు సూచన
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : నాగర్ కర్నూల్ జిల్లాలోని అర్హులైన రైతులందరికీ పంట రుణాలను అందించాలని, ప్రభుత్వ పథకాల అమలులో బ్యాంకర్లు చురుకైన పాత్ర పోషించాలని నాగర్ కర్నూల్ అడిషనల్ కలెక్టర్ జి.వి. శ్యాంప్రసాద్ లాల్ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా బ్యాంకర్ల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
వ్యవసాయ రుణాలు, చిన్న, మధ్య తరహా వ్యాపారవేత్తల రుణాలు, విద్యా, గృహ రుణాల మంజూరులో బ్యాంకులు ఏమాత్రం జాప్యం చేయకూడదని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లు, మెప్మా ద్వారా అమలయ్యే పథకాల లక్ష్యాలను ఈ నెల 30 లోపు పూర్తి చేయాలన్నారు. అనంతరం 2026–-27 సంవత్సరానికి సంబంధించి నాబార్డ్ రూపొందించిన ‘పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.
